అప్పు తీసుకుని ప్రజలను వేధిస్తున్న పోలీసులకు నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. 23వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ వచ్చింది. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. తమ వద్ద 8 ఏళ్ల క్రితం రూ.5 లక్షల అప్పు తీసుకున్న పోలీసు అధికారి తిరిగి చెల్లించకుండా బెదిరిస్తున్నారని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కర్నూతలకు చెందిన మిక్కిలి మరియమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు.
గతంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ సెక్యూరిటీ ఏఎస్పీగా పనిచేసిన తియోఫిలాస్ కు పొలం తాకట్టుపెట్టి అప్పు ఇచ్చాం. ఇంతవరకు చెల్లించలేదు. జగన్ రెడ్డి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. ఈ విషయంపై 2022లో డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. భర్త లేని తనకు పొలమే జీవనాధారం అని, విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.