బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలపై లోక్‌సభలో బిల్లు

-

లోక్‌సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లు 2024ను కేంద్ర ప్రభుత్వం ఇవాళ సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ద్వారా బ్యాంకు ఖాతాల నామినీల సంఖ్యను నలుగురి వరకు పెంచవచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఒక నామినీని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.

సహకార బ్యాంకులకు సంబంధించి కూడా బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లులో కీలక మార్పులు ప్రతిపాదించినట్లు తెలిసింది. చట్టబద్ధ ఆడిటర్లకు చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించుకునే స్వాతంత్ర్యాన్ని పూర్తిగా బ్యాంకులకే ఇవ్వనున్నట్లు సమాచారం. బ్యాంకుల రిపోర్టింగ్‌ తేదీలను రెండు, నాలుగో శుక్రవారాల నుంచి ప్రతినెలా 15, చివరి తేదీలకు మారుస్తూ సవరణ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు డైరెక్టర్‌షిప్‌ హోదా కోసం ఉండాల్సిన కనీస వాటా పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచనున్నట్లు తెలిసింది. ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్‌ గత శుక్రవారమే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ సభ ఆమోదం కోసం లోక్‌సభ ముందుకు బిల్లు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news