భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ‘కాస్’లో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. రజత పతకం ఇవ్వాలని చేసిన అప్పీలు తిరస్కరణకు గురైంది. దీనిపై ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష స్పందించి వినేశ్‌కు మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. తదుపరి న్యాయపరమైన ఆప్షన్లపై దృష్టిసారించామని.. క్రీడల్లో పారదర్శకతతోపాటు అథ్లెట్లకు న్యాయం జరగాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు.
కాస్ తీర్పు వ్యతిరేకంగా రావడంతో వినేశ్ ఫొగాట్కు మద్దతుగా భారత రెజ్లర్ భజరంగ్ నిలిచాడు. ఈ సందర్భంగా ఆమెను చీర్ అప్ చేస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ‘‘చీకట్లో నీ పతకం కొట్టేశారు. అయితే, డైమండ్‌లా నువ్వు ప్రపంచమంతటా వెలిగిపోతున్నావు. భారతదేశ కోహినూర్ వజ్రానివి నువ్వు. ఎక్కడ చూసినా నీ పేరు తలుస్తున్నారు. ఎవరికైతే పతకాలు కావాలని అనుకుంటున్నారో.. వారంతా రూ. 15 లెక్కన కొనుక్కోండి’’ అని భజరంగ్ తన పోస్టులో పేర్కొన్నాడు.
రిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫైనల్‌కు ముందు 100 గ్రాములు అదనంగా బరువు ఉండటంతో అనర్హత వేటుపడిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ సంయుక్తంగా తనకు రజత పతకం ఇవ్వాలని వినేశ్ కాస్‌ను ఆశ్రయించింది.