తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఆదివారం రోజున ఓ ఫొటో వైరల్ అయింది. దాంతో పాటు ఆయన తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫొటో ఒకటి ఆదివారం రోజున వైరల్ అయింది. రౌడీషీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్‌ఫోన్‌లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్‌ఫోన్‌కు పంపించినట్లు సమాచారం. ఈ ఫొటో వైరల్ కావడంతో జైల్లో నిందితుడు దర్శన్‌కు రాచమర్యాదలు లభిస్తున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ఈ ఫొటోపై డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లు, ఇతర నిందితుల విచారణ అనంతరం తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.