జేఎన్‌యూలో అసలేం జరిగింది…!

-

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం జరిగిన దాడి ఇప్పుడు సంచలనంగా మారింది. కొందరు దుండగులు ముసుగులు ధరించి ప్రాంగణంలో ఉన్న సబర్మతితో పాటు పెరియార్ హాస్టళ్ళలోకి చొరబడి కర్రలు, రాడ్లు, రాళ్లతో విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన అధ్యాపకులపై కూడా దాడులకు దిగారు. ఈ దాడుల్లో దాదాపు 19 మంది విద్యార్థులు గాయపడగా పలువురి తలలు పగిలాయి.

విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌ ఆయిశీ ఘోష్‌ తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వాళ్లను ఎయిమ్స్ కు తరలించారు. ముసుగులు ధరించిన సుమారు 50 మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. ఆదివారం సాయంత్రం వర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ తలపెట్టిన ఓ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై స్పందించిన వర్సిటీ ప్రొఫెసర్‌ అతుల్‌ సూద్‌ మాట్లాడుతూ,

సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వర్సిటీలోని వసతి గృహాల్లోకి ప్రవేశించి పెద్ద, పెద్ద రాళ్లను రువ్వడం మొదలుపెట్టారని ఒక్కో రాయి పరిమాణం చాలా పెద్దదిగా ఉందన్నారు. అవి తగిలితే, తలలు పగిలిపోతాయన్న ఆయన రాళ్ల దాడిలో వర్సిటీ ఆవరణలో నిలిపి ఉంచిన కార్లన్నీ ధ్వంసమయ్యాయన్నారు. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీవీపీ స్పందించింది. వామపక్షాలకు చెందిన విద్యార్థి సంఘాలే ఈ దాడులకు పాల్పడ్డాయని, ఈ ఘటనలో ఏబీవీపీకి చెందిన పాతిక మంది విద్యార్థులకు గాయాలయ్యాయని, మరో 11 మంది ఆచూకీ తెలియడం లేదని ఆరోపించింది.

Read more RELATED
Recommended to you

Latest news