కేసు పెట్టాలంటే పోలీస్ స్టేషన్‌కే వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు.. ఇలా కూడా పెట్ట‌వ‌చ్చు..

-

తెలంగాణ పోలీసు శాఖ‌ తాజాగా మరో కొత్త ప్రయోగానికి శ్రీ‌కారం చుట్టింది. ఇప్పటి వరకు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిందే. అయితే, ఇకపై ఆ అవసరం లేదు. పీఎస్ కు వెళ్లకుండానే బాధితులు ఫిర్యాదులు చేయవచ్చు. అవును మీరు విన్న‌ది నిజ‌మే. తమ ప్రాంతాల్లో సంచరించే పోలీస్ పెట్రోలింగ్ సిబ్బందికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే సరిపోతుంది. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. అయితే, ఈ సదుపాయం తొలుత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఇతర కమిషనరేట్లకు, జిల్లాలకు విస్తరిస్తారు.

దేశంలోనే ఈ విధానం మొట్టమొదటగా హైదరాబాదులో అమలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ, ఈ మేరకు అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. పీఎస్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చినప్పుడు… స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ, రైటర్ కానీ అందుబాటులో లేకపోతే… వారు వచ్చేంత వరకు బాధితులు వేచి చూసే పరిస్థితి ఉండేదని… ఇకపై ఆ ఇబ్బందులు ఉండబోవని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను విస్తృతం చేయబోతున్నామని చెప్పారు. ఎక్కడ ఏ నేరం జరిగినా ముందుండేది పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బందేనని..  వారివల్ల విజిబుల్ పోలీసింగ్ పెరుగుతోందని అంజనీకుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news