తుపాన్ ఎఫెక్ట్ కారణంగా ఆంధ్రాలో రాబోయే 5 రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదివారం తెల్లవారు జామున కళింగపట్నం వద్ద తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతోందని, రాబోయే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుందని తెలిపింది. కాగా, నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డీఎంఏ వెల్లడించింది.
ఇదిలాఉండగా, తుపాన్ తీరం దాటిన నాటి నుంచి ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ పట్టణం ప్రాంతం వరద ముంపునకు గురైంది. ఏకంగా 30 సెంమీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.ఏకంగా అపార్ట్ మెంట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు చేరుకోవడంతో స్థానికంగా ఉండే ప్రజలు ఇళ్లకు తాళాలు వేసుకుని పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. వర్షాల కారణంగా భారీ ఆస్తి, పంట నష్టం వాటిల్లునట్లు తెలుస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం బాధితుల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.