తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ ఎఫెక్ట్ కేవలం ఏపీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. విస్తారంగా వర్షాలు కురుస్తుడటంతో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్‌లో ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్నారు. రోడ్ల మీద వరద నీరు పేరుకుని పోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇకపోతే ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం వాగు పరిసరప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.
స్థానిక ప్రజలు తీవ్ర పడుతున్నారు. తమను ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగుతున్నారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా తమకు ఒరిగిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో ఖమ్మం జిల్లాకు బయలు దేరేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఆదివారం మంత్రులు తుమ్మల, భట్టి, పొంగులేటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినా పరిష్కారం దొరకలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.