ఖమ్మం జిల్లాలో ఇటీవల వచ్చిన వరదలు అక్కడి భౌగోళిక స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. వరుసగా కురిసిన భారీ వర్షాలకు మున్నేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 10 గ్రామాలు నీట మునిగాయి. అంతేకాకుండా పంట పొలాలు భారీగా దెబ్బతిన్నాయి. భారీ వరదలకు ఖమ్మం రూరల్‌లోని ఆకేరు పరివాహక ప్రాంతాలు, మున్నేరు వాగు పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా వణికిపోయాయి. అధికంగా మున్నేరువాగు పరివాహాక ప్రాంతాలైన కస్నాతండా, తనగంపాడు, పిట్టలవారిగూడెం, తీర్థాల, వాల్యతండా, పోలెపల్లి, గోళ్లపాడు,కామంచికల్లు, దానవాయిగూడెం పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
అదే విధంగా ఆకేరు వాగు సమీపంలోని పంట పొలాలు కోతకు గురయ్యాయి.పామాయిల్,మిర్చితోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ ప్రాథమిక సమాచారం మేరకు పత్తి పంట -660 ఎకరాలు, మొక్కజొన్న -50 ఎకరాలు, వరి -1991 ఎకరాలు, మిర్చి -140 ఎకరాలు, పెసర-36 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వరదల పాలు కావడంతో అన్నదాతలు రోదిస్తున్నారు.