ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఫుల్ ట్రాఫిక్‌ జామ్..

-

నగరవ్యాప్తంగా గణపతులు నిమజ్జనానికి బయలుదేరాయి. ఆదివారంతో నవరాత్రులు పూర్తవ్వగా నిన్న రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో గణపతులు గంగమ్మ ఒడికి చేరేందుకు పయనమయ్యారు. దీంతో సోమవారం ఉదయం నుంచి ట్యాంక్‌బండ్ చుట్టుపక్క పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చిన ప్రైవేటు,ఆర్టీసీ బస్సులకు శోభాయాత్రలు ఎదురవ్వడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలో మీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి.

ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, అబిడ్స్, లిబర్టీ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు ఏమాత్రం ముందుకు కదలడం లేదు. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో వాహనాలను ఓ క్రమంలో ముందుకు పంపేందుకు పోలీసులు అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు సమాచారం. భద్రతాపరంగా పోలీస్‌ సిబ్బంది ఉన్నప్పటికీ హుస్సేన్ సాగర్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు పెద్దగా కనిపించడం లేదని సమాచారం.కాగా,రేపు ఖైరాతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం కొనసాగనుంది. అందుకోసం అన్నిఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.భద్రత కోసం 25 వేల మంది సిబ్బందిని పోలీస్‌ శాఖ కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news