తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రతి ఒక్కరూ లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్తుంటారు.అయితే, వెంకన్న లడ్డూ ప్రసాదం విషయంలో నాణ్యతపై గతంలోనూ పలు విమర్శలు వచ్చాయి.గత ప్రభుత్వ పాలనలో క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా తగ్గిందని పెద్ద విమర్శలు తలెత్తాయి. అయితే, తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని వాడారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఏకంగా ప్రభుత్వమే ప్రకటన చేయడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.
అయితే, ఈ విషయంపై టీటీడీకి నెయ్యిని సరఫరా చేసే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ స్పందించింది. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం పంపిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వెల్లడించింది.ఇదే విషయాన్ని టీటీడీకి సైతం వివరించినట్లు పేర్కొంది.అయితే, జులై నెలలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని ఏఆర్ డెయిరీ తెలిపింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని వాడినట్లు వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవాలేనని స్పష్టంచేసింది.