ఇంట్లో ఎంతమంది ఉన్నా…’తల్లికి వందనం’ ఇస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి నిమ్మల. ‘తల్లికి వందనం’ పథకాన్ని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15వేల చొప్పున ఇస్తామని ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకం ప్రారంభం కానుందని తెలిపారు. నంద్యాల మాల్యాల హంద్రీనీవా పంప్ హౌజ్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు… అనంతరం మాట్లాడారు.
చంద్రబాబు ఆదేశాల మేరకు హంద్రీనీవా సామర్థ్యం పెంచేలా , ప్రధాన కాలువ విస్తరించడానికే పర్యటన చేసినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ కలగన్నట్లు రాయల సీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. ఆసియాలోనే పెద్దది , పొడవైన ఎత్తిపోతల పథకం నిర్మించిన ఘనత టీడీపీ దే నని వివరించారు. 3,850 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా చంద్రబాబు మల్యాల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారన్నారు ఏపీ మంత్రి నిమ్మల. జగన్ పాలనలో హంద్రీ నీవా పనులు వెనుకబడి పోయాయని ఆగ్రహించారు. గత ఐదేళ్లలో ఇరిగేషన్ లో చేసిన పాపాలు, తప్పులు సరిచేస్తున్నామన్నారు.