తాను అవినీతికి పాల్పడినట్లు ప్రధాని మోడీ తనపై కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎంతో ప్రయత్నించారన్నారు. సీబీఐ,ఈడీ చేసిన అవినీతి ఆరోపణల కారణంగానే తన పదవికి రాజీనామా చేశానని కేజ్రీవాల్ చెప్పారు.ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆదివారం జరిగిన ‘జనతా కీ అదాలత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘గత పదేళ్లుగా ప్రభుత్వాన్ని నిజాయితీగా నడుపుతున్నాం.
కరెంటు, నీళ్ల కొరత లేకుండా చేశాం.ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాం. విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దాం. అందుకే ఆప్‌పై గెలుపుకోసం దాడి ఒక్కటే మార్గమని మోడీ నమ్మారు. ఆప్ సీనియర్ నేతలను నిజాయితీ లేని వారిగా నిరూపించడానికి జైలులో పెట్టేందుకు కుట్ర చేశారు’ అని వ్యాఖ్యానించారు.అవినీతి చేసి సీఎం కుర్చీలో కూర్చోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని, దేశాన్ని మార్చేందుకు మాత్రమే వచ్చానని తెలిపారు.