ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.తుని,కోనసీమ ఘటనలతో వైసీపీ కులాల చిచ్చు రగిలించి, జనాల్లో మతం మంటలు రేపాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ‘ఎక్స్’ వేదికగా పవన్ పోస్టు పెట్టారు. జగన్ డిక్లరేషన్‌పై పవన్ మాట్లాడుతూ..మాజీ సీఎం డిక్లరేషన్ సంగతి టీటీడీ చూసుకుంటుందని, డిక్లరేషన్ ప్రక్రియపై ఎవ్వరూ అతిగా మాట్లాడాల్సిన అవసరం లేదని హితవు పలికారు.
తాజాగా వైసీపీ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నందున పోలీసులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వ్యక్తుల్ని,ఇతర మతాలని లక్ష్యంగా చేసుకోవద్దంటూ సూచించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులు అన్యమతస్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయరాదన్నారు.ఒకవేళ హిందువులు రెచ్చిపోయి అలా చేస్తే వైసీపీ ప్లాన్ విజయవంతం అవుతుందని, అలా జరగరాదని పవన్ పిలుపునిచ్చారు. కాగా, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తిరుపతిలో ఆందోళనలకు దూరంగా ఉండాలని జనసేన నిర్ణయించినట్లు సమాచారం.