నేటి నుంచి తిరుమలలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు

-

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ రాత్రి అంకురార్పణతో ప్రారంభం అవుతాయి. సాధారణ రోజుల కంటే బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు అధికంగా తిరుమలకు వెళ్తుంటారు. అందులో దసరా సెలవులు కూడా కావడంతో  పిల్లలతో సహా కుటుంబం అంతా శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక్క రోజులోనే దర్శనమయ్యే విధంగా ఏర్పాట్లు చేశామని.. అదే రోజు వాహన సేవలో కూడా పాల్గొనవచ్చని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

ఆర్జీత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్టు ఆయన వెల్లడించారు. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే దర్శనాలుంటాయని, గరుడసేవ రోజున అనగా అక్టోబర్ 08న వీఐపీ దర్శనాలు కూడా రద్దు చేసినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించినట్టు చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక దర్శనాల నిమిత్తం ఆన్ లైన్ 1.32 లక్షల టికెట్లను ఇచ్చినట్టు వివరించారు. సర్వదర్శనానికి వచ్చే వారికి రోజుకు 24వేల దర్శనం టికెట్లను ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. వాహన సేవలో రోజుకు 80వేల మంది భక్తులు పాల్గొంటారని, గరుడ సేవ రోజు లక్షమంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసినట్టు ఈవో శ్యామల రావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news