దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని కేలాపూర్ శ్రీ జగదంబ అమ్మవారి దర్శనానికి వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్కూటీ మీద వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున జైనథ్ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వేగంగా ఢీకొన్నారు.
ఈ ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా శాంతినగర్ కాలనీకి చెందిన హర్షవర్ధన్ (17)అక్కడికక్కడే మరణించగా.. జైనత్ మండల కేంద్రానికి చెందిన నీరజ్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికులు నీరజ్‌ను హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న నీరజ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హర్షవర్ధన్ మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.