ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఇటీవల ఐటీ, బిజినెస్ సెక్టార్‌లోని ఉద్యోగాల్లో భారీగా కోత పడుతోంది. ఇప్పటికే ఐటీలో బడా కంపెనీలు సైతం కాస్ట్ కటింగ్ పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించాయి. తాజాగా ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ‘ఫోన్ పే’ సైతం తమ కస్టమర్ సపోర్టు స్టాఫ్‌లో కోత విధించింది. గడిచిన ఐదేళ్లలో 1,100 మంది నంచి 60శాతం ఉద్యోగులను తొలగించినట్లు ఫోన్ పే పేర్కొంది. AI ఆధారిత చాట్ బోట్ల ద్వారా ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీసులతో సమర్ధత పెరిగిందని ఆ సంస్థ తెలిపింది.
దీంతో సంస్థ సపోర్టింగ్ స్టాఫ్ 1,100 మంది నుంచి 400 మందికి పడిపోయిందని అక్టోబర్ 21న విడుదల చేసిన ఫోన్‌పే వార్షిక నివేదికలో తెలిపింది. కాగా, గత ఐదేళ్లుగా కస్టమర్ సపోర్ట్ విభాగంలో 90శాతం ఏఐ చాట్‌ను వాడుతున్నట్లు ఫోన్ పే తెలిపింది. కంపెనీ నష్టాలను తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఫోన్‌పే లావాదేవీలు 2018-19 నుంచి 2023-24 మధ్య 40 రెట్లు పెరిగినట్లు వార్షిక నివేదికలో వెల్లడైంది. 2022-23 ఆర్థిక ఏడాదిలో రూ.3,085కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం 2023-24లో రూ.5,725కోట్లకు చేరుకుందని తెలిపింది.