వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై వివాదం కొనసాగుతోంది.ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. గత ఆరేళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ఈ కేసులో తీర్పు చెప్పనుంది. 2009 నుంచి చెన్నమనేని భారత పౌరసత్వంపై వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
జర్మనీ పౌరసత్వం ఉన్నందున 2019లో ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది.దీనిని చెన్నమనేని కోర్టులో సవాల్ చేశారు. అంతేకాకుండా, 2018లో ఆయన తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ ఎన్నికల టైంలో రమేశ్ జర్మనీ పాస్‌పోర్టుపై ప్రయాణాలు చేశారని, ఆ దేశ పౌరసత్వం మీదే ఎన్నికల్లో పోటీ చేశారని, ఇది చట్టవిరుద్ధం అని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన ధర్మాసనం చెన్నమనేని ఫారిన్ టూర్ల వివరాలు అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇదిలాఉండగా, తాను జర్మనీ పౌరసత్వం క్యాన్సిల్ చేసుకుని ఇండియాలో కొనసాగుతానని రమేశ్ గతంలో స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.