సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకపడుతున్నాయి. ఈ క్రమంలోనే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా కాంగ్రెస్ సర్కార్, ముఖ్యమంత్రిపై మరోసారి ఫైర్ అయ్యారు.మూసీ పరివాహక ప్రాంతంలోని పేదల ఇళ్లు కూల్చి వారి శవాల మీదే నీ పరిపాలన సాగిస్తానంటే అది రేవంత్ రెడ్డి ఖర్మ అని.. ఈటల మండిపడ్డారు.కళ్ళు నెత్తికెక్కి ప్రజల జీవితంతో చెలగాటం ఆడిన గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికీ అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.
బుధవారం రామాంతపూర్‌లోని బాలకృష్ణ నగర్ మూసీ పరివాహక ప్రాంతంలో ఈటల నేతృత్వంలో బీజేపీ నేతలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, శిల్పారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బృందం పర్యటించింది. అక్కడి స్థానికుల సమస్యలను బీజేపీ ప్రతినిధి బృందం అడిగి తెలుసుకుంది. తమ ఇళ్లను కూల్చివేస్తారనే ప్రచా జరుగుతున్నదని తమను ఆదుకోవాలని ఈటలను స్థానికులు విన్నవించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అదరగొట్టే రీతిలో రాజకీయ ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్పా.. నిజంగా ప్రజల ఆవేదన ఏంటో క్షేత్రస్థాయిలోకి వస్తే తెలుస్తుందన్నారు. మా లాంటి వారు మాట్లాడితే రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని గుర్తుచేశారు.