ఏపీలోని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో అడవి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా, గ్రామస్తులపై దాడికి పాల్పడ్డాయి. ఏనుగుల దాడిలో పీఎంకే తండాకు చెందిన రెడ్యానాయక్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఏనుగులు రెడ్యానాయక్‌ను తొక్కి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏనుగుల గుంపు బీభత్సంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు ఏనుగులను అక్కడి నుంచి తరిమేందుకు నానా తంటాలు పడుతున్నారు. అందుకోసం కుంకి ఏనుగుల సాయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో వరి, అరటి, టమోటా, బీన్స్ , మిర్చి తదితర పంటలను ధ్వంసం చేయడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని నెలల కిందట ఇదే పీఎంకే తండాకు చెందిన రైతు కన్నానాయక్ కూడా ఏనుగుల గుంపు దాడిలో మరణించాడు.