రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్లు ఓకే పోలీస్ విధానం కావాలని ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న వేళ మరో దారుణ విషయం వెలుగుచూసింది. ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఏకంగా తన ఇంట్లో పెళ్లి కోసం బెటాలియన్ కానిస్టేబుల్స్‌ను బ్యాండ్ వాయించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేటలో గల ఓ చర్చిలో జరిగినట్లు సమాచారం.
పెండ్లి బ్యాండ్ వాయించేందుకు మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లను మాజీ ఐపీఎస్ ఆదేశించినట్లు తెలిసింది. కానిస్టేబుళ్లతో బ్యాండ్ వాయించడం ఏంటని సదరు అధికారిని ప్రశ్నిస్తే, నిబంధనల మేరకే ఈ పనులు చేయించుకుంటున్నామని సమర్థించుకున్నట్లు తెలిసింది. కాగా, బెటాలియన్ కానిస్టేబుళ్లను పై అధికారులు తమ సొంత పనుల కోసం వాడుకుంటున్నారని, రెండు మూడు రోజుల కొకసారి ఇంటికి వస్తున్నారని వారి భార్యలు ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.వీరి కోసం కూడా ఓకే పోలీస్ విధానం అమలుచేయాలని బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన చేస్తున్నారు.