Hyderabad: మెట్రో రెండో దశ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్..ఈ రూట్లలోనే !

-

హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది. సిటీ విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ పెరగటంతో ఇప్పుడున్న మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు సంబంధించిన డీపీఆర్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.24269 కోట్ల అంచనాలతో చేపట్టే మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాగానే పనులు మొదలు పెట్టి రాబోయే నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది.
హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశలో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు విజయవంతంగా సేవలందిస్తోంది.

metro

ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రూ.22,000 కోట్ల తో నిర్మించారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. రెండో దశ అందుబాటులోకి వస్తే సిటీలో రోజుకు మరో 8 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తారు. మెట్రో రైల్ మొదటి దశ అమలైనప్పుడు హైదరాబాద్ దేశంలోనే ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో నిలిచింది. గత ప్రభుత్వం ఏడేండ్లుగా మెట్రో విస్తరణను పట్టించుకోలేదు. ఈలోపు మిగిలిన నగరాలన్నీ రెండో, మూడో దశ నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశాయి.

■ ప్రస్తుతం మూడు కారిడార్లు ఉన్నాయి. రెండో దశ లో ప్రతిపాదించిన కొత్త 5 కారిడార్ లు…

నాలుగో కారిడార్ నాగోల్– శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు (36.8 కి.మీ)

అయిదో కారిడార్ రాయదుర్గ్–కోకాపేట్ నియోపొలిస్ వరకు (11.6 కి.మీ)

ఆరో కారిడార్ ఎంజీబీఎస్–చంద్రాయన్ గుట్ట వరకు (7.5 కి.మీ)

ఏడో కారిడార్ మియాపూర్–పటాన్చెరు వరకు (13.4 కి.మీ)

ఎనిమిదో కారిడార్ ఎల్ బీ నగర్–హయత్ నగర్ వరకు (7.1 కి.మీ.)

■ మెట్రో రెండవ దశను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు పీపీపీ విధానంలో చేపడుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news