సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 8వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తొలుత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత అక్కడ వైటీడీఏ (YTDA)పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ధి పనులపై చర్చలు జరుపుతారు. అనంతరం భువనగిరి నియోజకవర్గ పరిధి వలిగొండ మండలంలో గల బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు ఎమ్మెల్యే కుంభం అనిల్ ఆధ్వర్యంలో చేపట్టబోయే మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్రలో సీఎం పాల్గొననున్నారు.
మిషన్ భగీరథ పథకంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌లైన్ ప్రాజెక్ట్ పైలాన్‌ను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత పైప్‌లైన్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. కాగా, సీఎం యాదాద్రి టూర్ షెడ్యూల్‌ను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పర్యవేక్షిస్తున్నారు. సీఎం వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.