తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే (కులగణన)పై ప్రతిపక్ష పార్టీలు పెదవి విరుస్తున్నాయి. అసలు ఈ సర్వే ఎందుకోసం నిర్వహిస్తున్నారని కొందరు ప్రశ్నిస్తుండగా.. ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు సంబంధించి కొందరు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఏకంగా 75 ప్రశ్నలు ఈ సర్వే సందర్భంగా అడుగుతారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.అయితే, సర్వేలో ఇంట్లోని వస్తువులు, బ్యాంకు అకౌంట్ వివరాలను ఎందుకు సేకరిస్తున్నారని కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు.
‘సర్వేకు మేము వ్యతిరేకం కాదు. అసలు సర్వే గురించి ప్రజాప్రతినిధులకే పూర్తి సమాచారం లేదు. అయినప్పటికీ దీనిని స్వాగతిస్తున్నాం. సర్వేకు ఇంట్లోని వస్తువులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అడుగుతున్నారు. దీనిపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వివరాలతో తమకు అందుతున్న పథకాలను, ఉన్న గుర్తింపు కార్డులను సైతం రద్దు చేస్తారా? అని ప్రజలు భయపడుతున్నారని’ ఆయన ప్రశ్నించారు.