డిప్యూటీ స్పీకర్ పదవిపై.. కొనసాగుతున్న ఉత్కంఠ..

-

ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవిపై కూటమి ప్రభుత్వంలో ఉత్కంఠ కొనసాగుతోంది.. తెలుగుదేశం పార్టీకి స్పీకర్ పదవి దక్కడంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీ ఛేజిక్కించుకోబోతుందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది.. కమలం పార్టీ చీఫ్ విప్ లపై గురి పెట్టినట్లు తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో.. ఎవరికి యే పదవి వరించబోతుందన్న సస్పెన్స్ కొనసాగుతుంది.. డిప్యూటీ స్పీకర్ తో పాటు విప్ పదవులను మూడు పార్టీలు ఎలా పంచుకోబోతున్నాయని చర్చ ఆసక్తికరంగా మారింది..

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి దక్కబోతుందనే అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. స్పీకర్ గా టిడిపి నేత అయ్యన్నపాత్రుడు ఉండడంతో.. డిప్యూటీ స్పీకర్ పదవి బిజెపికా లేక జనసేనకా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారంటూ జనసేన వర్గాలు చెబుతున్నాయి. బిజెపి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుందని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది..

డిప్యూటీ స్పీకర్ రేసులో టిడిపి తరఫున మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ పేరు గట్టిగా వినిపిస్తోంది.. ఆయనతోపాటు విశాఖకు చెందిన బీసీ నేత గణబాబు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో.. గణబాబుకు అవకాశాలు తక్కువేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. చీఫ్ విఫ్ రేసులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ధూళిపాల నరేంద్ర తోపాటు జీవీ ఆంజనేయులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చీఫ్ విప్ లు గతంలో కేవలం నలుగురే ఉండేవారు.. వైసిపి హయాంలో 9 మందికి విఫ్ ల అవకాశం దక్కింది.. ఇప్పుడు ఆ సంఖ్యను 14కి పెంచే ఆలోచనలో కూటమి సర్కార్ ఉందట. నామినేటెడ్ పోస్టులు ప్రధాన పదవులు మిస్సయిన నేతలకు చీఫ్ విప్ పదవి కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందట.. అందులో భాగంగా జనసేనకి నాలుగు బీజేపీకి రెండు పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది..

జనసేన నుంచి విప్ గా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మరో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆరుగురిలో నలుగురికి విప్ పోస్టులు దక్కే ఛాన్స్ ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.. అలాగే బిజెపి నుంచి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రేస్ లో ఉన్నట్లు కమలనాధులు ప్రచారం చేస్తున్నారు. ఈ పోస్టులపై త్వరలోనే ఓ క్లారిటీ రాబోతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news