ఇకపై కాస్మోటిక్ ఛార్జీలు, స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు శాసనసభలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. గత వైసిపి పాలనలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు నిర్వీర్యం అయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 221 కోట్లతో 65 నూతన వసతిగృహాలు నిర్మించబోతున్నామని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా హాస్టల్ మరమ్మత్తుల నిమిత్తం బడ్జెట్లో 143 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. వైసిపి హయాంలో ఏడాదికి వసతి గృహాలు నిర్వహణకు కేవలం 2 కోట్ల 69 లక్షలు కేటాయిస్తే.. నేడు టిడిపి పాలనలో ఒక పల్నాడు జిల్లాకే రెండు కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. హాస్టల్స్ లో ట్యూటర్స్ గా స్థానిక యువతకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాస్మోటిక్ ఛార్జీలు స్కాలర్ షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా విద్యార్థుల ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక వైద్య అధికారిని నియమించామని… పేదల విద్య, ఆరోగ్యం సామాజిక భద్రతకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.