తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1987 నుంచి ఆగస్టు 1992 వరకు మొదటిసారి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత 2000 నుంచి 2005 వరకు రెండోసారి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, 2005 అక్టోబర్ నుంచి అక్టోబర్ 2010 వరకు వైస్ చైర్మన్ గా పని చేశాడు. ఆయన ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ ని వీడి టీడీపీలో చేరాడు.
2014లో ఏపీ నుంచి తాడిపత్రి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2019లో పోటీ చేయలేదు. తన కుమారుడు అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించగా.. అతను ఓడిపోయాడు. 2021లో మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నికయ్యాడు. తాజాగా ఆయన మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. “నన్ను తాడిపత్రి నుంచి తరిమేయండి. పట్టణ ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే కఠిన చర్యలు ఉంటాయి. నీళ్లు, కరెంటు కట్ చేస్తా, పెనాల్టీ వేస్తా, చివరగా మీరు వేసిన చెత్త మీ ఇంట్లోనే వేస్తా. మీరు మారుతారా? లేదంటే నన్నే ఊరి నుంచి తరిమేయండి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.