ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 29న 5 జిల్లాలలో 54 కరువు మండలాలను ప్రకటించామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. వర్షాలు లేక ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం అందిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు 1.06 లక్షల హెక్టార్లలో 1.44 లక్షల మంది రైతులు పంట నష్టపోయినట్టు తేలిందన్నారు. అందుకు రూ.159.20 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు.
త్వరలోనే రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. ఈనెల 28వ తేదీ వరకు సమగ్ర అంచనాలు వేసి నష్టపోయిన వారందరికీ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కరువు పీడిత మండలాల అంశం పై శాసనమండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుడమేరు వరదల్లో నష్టపోయిన రైతుల ఖాతాల్లో 20 రోజుల్లోనే నష్టపరిహారాన్ని జమ చేసినట్టు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో 80 శాతం కౌలు రైతులకు నేరుగా ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని తెలిపారు.