మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొనే నేతల బ్యాగులు, హెలికాప్టర్లను తనిఖీలు చేస్తున్నారు అధికారులు. తాజాగా ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బ్యాగులను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. అమరావతిలో ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే అధికారులు చెక్ చేశారు. బ్యాగులతో పాటు హెలికాప్టర్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాహనాన్ని కూడా తనిఖీ చేశారు.
మహారాష్ట్రలో ఈ ఎన్నికల తనిఖీలు తాజాగా రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇటీవలే మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రె బ్యాగులను ఎన్నికల అధికారులు పలుమార్లు తనిఖీ చేయడం చర్చనీయాంశమైంది. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఎన్నికల అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఆ తరువాత పలువురు ప్రతిపక్ష నేతలు కూడా ఇలాగే అసహనాన్ని వ్యక్తం చేశారు.