ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. తాజాగా ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా జగన్ సమీక్ష నిర్వహించలేదని.. దీంతో దుండగులు విపరీతంగా రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసారు. గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై అసెంబ్లీలో ప్రశ్నలు వేశారు. వీటికి హోంమంత్రి అనిత సమాధానం చెప్పారు.
ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికీ చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్, సబ్ కమిటీ ఏర్పాటు చేశామని.. దీంతో నేరస్తులను అణచివేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే ఏడు సార్లు సమీక్ష నిర్వహించారని వివరించారు. గత ఐదు నెలల్లో 25వేల కిలోలకు పైగా గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గంజాయిని సాగు చేసినా.. తరలించిన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా ఆస్తులను కూడా జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు మంత్రి అనిత.