తెలంగాణ చరిత్ర పై కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అని కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. “నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) రేపు ప్రారంభమవుతున్న సందర్భంలో ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం వెనక ఉన్న కేసీఆర్ గారి దార్శనికత, కృషి తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుంటుంది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కేసిఆర్ గారి దీర్ఘ దృష్టికి, భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో అనితరసాధ్యమైన వేగానికి మరొక ఉదాహరణ.
YTPS పూర్తి సామర్థ్యం 4000 మెగావాట్లు (5×800) – స్వతంత్య్ర భారత చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఇదే. YTPS నిర్మాణాన్ని BRS ప్రభుత్వం BHELకు అప్పగించింది. దాదాపు రూ.20,400 కోట్లు విలువైన అర్డర్, భారత విద్యుత్ రంగ చరిత్రలో ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వబడిన అత్యంత విలువైన ఆర్డర్‌గా నిలిచింది. నిత్య కరెంట్ కోతలు, వారానికి రెండు రోజుల పవర్ హాలీడేల దుస్థితి నుంచి అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ గారి దార్శనితకలో ఒక భాగమే యాదాద్రి పవర్ ప్లాంట్” అంటూ రాసుకొచ్చారు కేటీఆర్.