కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముగింపు వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో వాలీబాల్ ఆడుతూ ఓ విద్యార్థి ఉన్నట్టుండి కుప్పకూలాడు.
అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లె తండాలో ఆదివారం వెలుగుచూసింది. మృతుడు బలిజపల్లి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పదవ తరగతి చదివే సాయి పునీత్‌గా గుర్తించారు.ఉదయం ఖో ఖో ఆడుతూ ఒకసారి పడిపోయిన విద్యార్థి.. తిరిగి మధ్యాహ్నం మళ్ళీ వాలీబాల్ ఆడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలినట్లు తోటి విద్యార్థులు పేర్కొన్నారు. వనపర్తి ఆసుపత్రికి తరలించే లోపు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.