వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మంగళవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి మితిమీరిన మాటలను పోలీసులు ఉపేక్షించాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఇంకా బయట తిరుగుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.
విజయసాయి రెడ్డి కి కొవ్వు ఎక్కువ అని, ఆయన ఓ రోగ్ లాగా మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నీ బ్రతుకంతా తెలుసు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. గతంలో పింక్ డైమండ్ గురించి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారికి చెందిన కొన్ని విలువైన ఆభరణాలు, పింక్ డైమండ్ చంద్రబాబు వద్దే ఉన్నాయని అన్నారు విజయసాయిరెడ్డి.
కేంద్ర బలగాలతో వెంటనే చంద్రబాబు నివాసంలో తనిఖీలు చేపడితే అవన్నీ దొరుకుతాయని అన్నారు. అయితే విజయసాయిరెడ్డిని జైలుకు పంపడానికి ఈ ఒక్క అసత్య ఆరోపణ చాలని అన్నారు సోమిరెడ్డి. దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లు జగన్ తో అవినీతిలో ఆయన పోటీపడ్డారని విమర్శించారు.