సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది. గతంలో వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల మేరకు రూ.వేల కోట్లతో నిర్మించిన పోలవరం ప్రాజెక్టులోని డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా.. కేంద్రం నుంచి భారీగా నిధులు సమకూరాయి.దీంతో వరదల ధాటికి డ్యామేజ్ అయిన డయా ఫ్రమ్ వాల్ స్థానంలో మరో కొత్త వాల్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
ఈ క్రమంలోనే సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ నెల 16న చంద్రబాబు పోలవరం చేరుకోనున్నారు. అనంతరం జనవరి 2 నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనుల గురించి ఇంజినీర్లను అడిగి వివరాలు తెలుసుకుంటారు. పోలవరానికి కేంద్రం నుంచి రూ. 15 వేల కోట్లు నిధులు రావడంతో త్వరిత గతిన ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉన్నది. పోలవరంలో చేపట్టబోయే వివిధ రకాల పనులపై రూపొందించిన పూర్తి షెడ్యూల్‌ను సీఎం ప్రకటిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.