అసెంబ్లీలో భూభారతి -2024 ఆర్వోఆర్ చట్టం ప్రవేశపెట్టారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా 2024 ఆర్వోఆర్ -భూభారతి చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. బుధవారం శాసనసభలో మంత్రి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటువంటి అద్భుతచట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం తనకు లభించడం మరచిపోలేని విషయమని అన్నారు. 1971లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్వోఆర్ చట్టం 49 ఏళ్లపాటు ఉపయోగపడిందని, ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కూడా ప్రజోపయోగంగా ఉపయుక్తమయ్యిందని తెలిపారు. తర్వాత అర్ధరాత్రి నాలుగు గోడల నడుమ రూపొందిన ధరణి చట్టం వలన సమస్యలు పరిష్కారం కాకపోగా లక్షలాది సమస్యలను తెచ్చిపెట్టిందని చెప్పారు.
అనుభవదారుడు / ఖాస్తు కాలం:
2014 కి ముందు పాస్ బుక్కులు కలిగి ఉంది అనుభవదారుడిగా పొసిషన్ లో ఉన్న వారు ధరణి తరువాత రోడ్డున పడ్డారు. గత ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించింది.
ఈ భూ భారతిలో పట్టాదారులు, అనుభవదారులు అభద్రతాభావానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఈ చట్టం వీరికి సముచిత స్థానం కల్పిస్తాం.
మాన్యువల్ రికార్డుల భద్రత:
రెవెన్యూ రికార్డులు టాంపరింగ్ జరగకుండా కంప్యూటర్ రికార్డులతో పాటు నిర్ణీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా రెవెన్యూ కార్యాలయాలలో భద్రపరుస్తాం.
భూ-భారతి ప్రత్యేకతలు
• ఆరు మాడ్యూళ్ళు : ఆనాటి ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ్ళకు కుదిస్తున్నాం.
• 11 కాలమ్‌లు : గతంలో మాన్యువల్‌గా పహాణీలో 32 కాలమ్‌లు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలమ్‌కు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేస్తున్నాం.
• డిస్ప్లే : గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది. ఇప్పుడు భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్ప్లే చేస్తున్నాం.
• ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురికాకుండా ఎవరైనా భూ భారతి ద్వారా ప్రభుత్వానికి తెలియ చేయవచ్చు. ఆ భూముల్ని పరిరక్షించేలా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాం.
• భూ-భారతిలో దరఖాస్తు చేసుకున్న భూములున్న ఆసాములకు వారి మొబైల్ నెంబర్లకే అప్డేట్స్ వెళ్ళే సౌకర్యాన్ని కల్పిస్తున్నాం.
• గతంలో ధరణి కారణంగా అన్యాక్రాంతమైన భూముల వివరాలను భూ భారతి ద్వారా బట్టబయలు చేస్తాం.
• 2014కు ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేస్తాం.
• ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినవారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం.
======
• మూడు నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ : గత ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాత మూడేండ్లు దాటినా రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో తప్పులు జరిగాయి. ఆ తప్పుల్ని ప్రజలపై బలవంతంగా రుద్దింది. ఇప్పుడు అలా జరగకుండా మూడు నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ చేస్తాం.
• గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు : రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాత గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులతో పాటు నేను, సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి పరిష్కారాన్ని యుద్ధ ప్రాతిపదికన కనుగొంటాం.
• త్వరలో ఒకే చట్టం : గత ప్రభుత్వం మాటలతో మభ్య పెట్టింది. కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.
• ఇద్దరు వ్యక్తులు 2020 ఆర్వోఆర్ చీకటి చట్టాన్ని ప్రజలపై రుద్దారు. పూర్తి అవినీతితో నిండిపోయిన ఈ చట్టం మూడేండ్లకే నూరేండ్లు నిండిపోయేలా ప్రజలే మార్గనిర్దేశం చేశారు.
• అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకొస్తున్న భూ-భారతి చట్టం కనీసం వందేళ్ళు వర్ధిల్లుతుందని ఈ ప్రభుత్వం బలంగా నమ్ముతున్నది.
===