ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం స్థానికులకు తగు నష్ట పరిహారం ఇచ్చి పనులు చేపట్టారు. ముందుగానే అందరికీ నోటీసులు ఇచ్చారు అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి అన్నారు. కానీ అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా అక్కడకు వచ్చి నోటీసులు ఇవ్వలేదంటూ హంగామా చేశారు. స్థానికులు కొందరు మీ సహాయం మాకు అవసరం లేదని వాళ్లకు తెగేసి చెప్పారు. అప్పుడు మేము చెప్పినవన్నీ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ తో నిజాలని రుజువయ్యాయి.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన అబద్ధాలకు ఏపీ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేశారు. సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా విశాఖ కంటైనర్ లో పెద్దఎత్తున డ్రగ్స్ వచ్చాయని అప్పట్లో అబద్ధాలు వల్లే వేశారు. ఇప్పుడు సీబీఐ రిపోర్ట్ లో దానిలో అసలు డ్రగ్స్ లేవని క్లీన్ చిట్ ఇచ్చింది నిజం కాదా. మీరు ఈ అబద్దాలకు సమాధానం చెప్పాలి. ఆరు నెలల్లోనే మీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రతీ పథకాన్ని నీరు గార్చారు. ప్రజలు మాకు 40 శాతం ఓట్లు వేసి మీరు తప్పు చేస్తే నిలదీసే హక్కు ఇచ్చారు. త్వరలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ పార్టీ అధినేత జగన్ ప్రజల్లోకి వస్తారు అని రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు.