సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంధ్య థియేటర్ వద్ద గాయపడ్డ శ్రీ తేజ ని పరామర్శించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కిమ్స్ ఆసుపత్రిలో శ్రీ తేజ ఆరోగ్యం పై ఆరా తీశారు. ఈ సందర్భంగా కిమ్స్ వైద్యులకు మంత్రి కోమటిరెడ్డి పలు సూచనలు చేశారు.
శ్రీ తేజ్ చికిత్స కు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. అవసరం అయితే అమెరికా నుంచి అత్యాధునిక మందులు తెప్పించి శ్రీతేజ్ ని బ్రతికించాలని కిమ్స్ వైద్యులకు సూచించారు. అనంతరం శ్రీ తేజ తండ్రికి రూ. 25 లక్షల చెక్ ని అందించారు. ఇక శ్రీ తేజ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
బాలుడిని చూస్తే తనకు బాధతో పాటు భయమేస్తుందని అన్నారు శ్రీ తేజ ఎప్పుడు కోలుకుంటాడో తెలియదని.. ఒకవేళ కోలుకున్నా మునుపటిలా ఉండొచ్చు, ఉండకపోవచ్చునన్నారు. మాటలు రావచ్చు, రాకపోవచ్చని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు మంత్రి కోమటిరెడ్డి. శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా తాను కూడా చూశానని.. ఇకపై ఇలాంటి సినిమాలు చూడనని తెలిపారు.