అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అంటే ఎక్కడైనా, ఏ విషయంలోనైనా అతి పనికిరాదని అర్థం. నిజమే.. ఇది స్నేహితుల విషయంలోనూ వర్తిస్తుంది. నాకు వెయ్యి మంది ఫ్రెండ్స్ ఉన్నారని ఎవరైనా చెబితే తక్కువ ఫ్రెండ్స్ ఉన్న మీరు.. అయ్యో అలానా నాకు తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారే అని బాధపడాల్సిన పనిలేదు.
ఎందుకంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఉండడం వల్ల, మరీ ముఖ్యంగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి.
టైం వేస్ట్ వ్యవహారాలు:
క్లోజ్ ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేయాలంటే అవతలి వాళ్లకు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఎక్కువ మంది క్లోజ్ అయ్యారంటే మీరు వాళ్లతో ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దీనివల్ల మీ ప్రోడక్టివిటీ తగ్గిపోతుంది.
అనుమానాలు, అపార్ధాలు:
మనుషులందరూ ఒకే రకంగా ఉండరు కాబట్టి అనుమానాలు, అపార్ధాలు రావడం సహజం. ఒకరిద్దరు క్లోజ్ గా ఉన్నారనుకోండి, వాళ్లకు మీ మీద అనుమానం వచ్చినా, అపార్థం వచ్చినా దాన్ని క్లియర్ చేయడం చాలా ఈజీ. ఎక్కువమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే చాలా కష్టం. దానివల్ల అనవసరంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
ప్రైవసీ ఇబ్బందులు:
క్లోజ్ ఫ్రెండ్స్ తో అన్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా షేర్ చేసుకుంటేనే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు లెక్క. ఎక్కువమంది ఉంటే మీ పర్సనల్ విషయాలు ప్రైవేట్ గా ఉండడం కష్టమవుతుంది.
బంధం స్ట్రాంగ్ గా ఉండకపోవడం:
ఒకరిద్దరితో స్ట్రాంగ్ గా స్నేహాన్ని మెయింటైన్ చేయొచ్చు కానీ పదిమందితో అలాగే ఉండాలంటే ఎవరికైనా కష్టం. క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువైతే ఆ కష్టాన్ని ప్రతీసారి భరించాల్సి ఉంటుంది.
సాధారణంగా జీవితంలో విజయాలు సాధించే వాళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారట. వాళ్లకు పరిచయస్తులు ఎక్కువమంది ఉంటారు.