వాజ్ పేయి అఖండ భారతం కోసం కలలు కన్న దార్శనికుడు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా బండి సంజయ్ స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. భారత జాతికి శాంతిమంత్రం జపించడమే కాదు, యుద్ధతంత్రం తెలుసునని నిరూపించిన నాయకుడు అని, సుపరిపాలనను పరిచయం చేసిన పరిపాలనాదక్షుడు అని వాజ్ పేయిని కొనియాడారు.
అంతేకాదు.. తన జీవితాన్ని భారతమాత సేవకై అంకితమిచ్చిన దేశభక్తుడు అని, శత్రువుల చేత కూడా శభాష్ అనిపించుకున్న అజాత శత్రువు అని కీర్తించారు. ఇక తన కవిత్వంతో జాతి ఊపిరిలో నిత్యం నిలిచిన అమరుడు.. మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా. ఆ మహనీయుడికి శతకోటి వందనాలు సమర్పిస్తూ.. ప్రజలందరికీ సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.