గాంధీభవన్ లో టీ – కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఎసి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి కూడా హాజరయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ మాజీ అధ్యక్షులు, సీఎల్పీ మాజీ నేతలు, రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు, 23 మంది పిఎసి మెంబర్లు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాజకీయపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవడంపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా పాలన తీరుపై ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది, రానున్న లోకల్ బాడీ ఎన్నికలతో పాటు మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక, వారిని గెలిపించుకునేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు తీరు, రాబోయే నాలుగు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రతిష్టను పెంచే రీతిలో ఎటువంటి పాలన చేపట్టాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలలోకి విస్తృతంగా ఎలా తీసుకువెళ్లాలి, కేడర్ కి ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండే విధంగా సూచనలు, త్వరలో ప్రారంభించనున్న రైతు భరోసా, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా వంటి చాలా అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.