జనవరి 26 నుంచి పేద ప్రజల కోసం నూతనంగా నాలుగు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు లో నిర్మించిన 80 ఇళ్ల గృహ సముదాయాన్ని ప్రారంభించి, ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అప్పగించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి కానుకగా పేదలకు 80 డబుల్ బెడ్ రూం ఇండ్లు అందిస్తున్నామని అన్నారు. సంవత్సరం క్రితం ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, గత 10 సంవత్సరాల సమయంలో జరిగిన అవకతవకలను సరి చేసేందుకు సంవత్సర సమయం పట్టిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పేదలకు మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అని, రాబోయే రోజులలో వేల సంఖ్యలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు.