ప్రభుత్వ పథకాల అమలుకు జరుగుతున్న లబ్దిదారుల ఎంపికపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్జి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ మొదలవుతుందన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి 12వేల రూపాయలు ఇవ్వబోతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి 12వేలు ఇస్తామని.. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు లబ్దిదారులను గ్రామ సభల్లో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎంపిక చేస్తారన్నారు. లబ్దిదారుల జాబితా ఎక్కడో తయారు కాదు. ఇందులో అపోహలు, అవమానాలు పెట్టుకోవద్దని తెలిపారు.