ఆన్ లైన్ బెట్టింగుల బారిన పడి మరో వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో మంగళవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. నరసరావుపేటకు చెందిన ఉదయ్ కిరణ్ (32) ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అయ్యాడు. గేమ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు తీవ్రంగా అప్పులు చేశాడు.
దాదాపు రూ.10 లక్షల మేర అప్పు చేసిన కిరణ్.. ఆ డబ్బంతా బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. అంత పెద్ద మొత్తంలో అప్పు తీర్చలేక సోమవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి స్వస్థలం ప్రకాశం జిల్లా బల్లికురవ గ్రామం. కొంతకాలంగా నరసరావు పేటలో నివాసం ఉంటున్నాడు. కిరణ్ ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.