హెచ్-1 బీ వీసా అనేది కొన్ని ప్రత్యేకమైన వృత్తులలో ప్రావీణ్యం ఉన్న వారికి, విదేశాలలో ఉద్యోగం చేసుకోవటానికి ఇస్తారు. ఈ హెచ్-1 బీ వీసా కి మొదటగా 3 సంవత్సరాలు గడువు ఉంటుంది, తరువాత వారి ఉద్యోగ పురోగతి ఆధారంగా మరో 3 సంవత్సరాలు పొడుగించుకోవచ్చు. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఈ హెచ్-1 బీ వీసా దారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది..అదేంటంటే…
న్యూజెర్సీ రాష్ట్రంలో ఉంటున్న హెచ్-1బీ వీసా కలిగిన వారి పిల్లలకు ఉన్నత విద్యాసంస్థల్లో ఉచిత విద్యకై అక్కడి ప్రభుత్వం ఒక చట్టం చేసింది. దీనికి సంబంధిచిన బిల్లు పై ఆ రాష్ట్ర గవర్నర్ ఫిల్ మర్ఫీ మంగళవారం సంతకం చేశారు. అయితే గత కొంతకాలంగా అమెరికా ప్రభుత్వం వలస చట్టాలపై కఠినతర నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో ఇలాంటి చట్టం చేయడం సంచలనం సృష్టిస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ చట్టం పై న్యూజెర్సీ లోని భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు. వారి పిల్లల విద్య విషయంలో ఈ చట్టం కలిగించే వెసులుబాటు, ఆర్ధికంగా వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. బిల్లుపై సంతకం చేస్తున్న సమయం లో న్యూజెర్సీ రాష్ట్ర గవర్నర్ మర్ఫీ “ ఉన్నత విద్యను పొందడానికి న్యూజెర్సీ వాసులందరు అర్హులే, అందుకోసమే ఈ చట్టాన్ని రూపొందించామని ప్రకటించారు.