ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ నీ భారత్ కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. పూణే వేదికగా జరిగిన కీలకమైన నాలుగో మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 19.4 ఓవర్లలో 166 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఇంగ్లండ్ కీలక ఆటగాడు హ్యారీ బ్రూక్ 51 అర్థ శతకంతో వీరోచిత పోరాటం చేసినప్పటికీ.. ఇంగ్లాండు కు ఫలితం దక్కలేదు. భారత్ బౌలర్లలో హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు తీశారు. వరుణ్ 2, అక్షర్ 1, హర్ష్ దీప్ సింగ్ 1 వికెట్ తీశారు.
ఈ మ్యాచ్లో భారత్ టాపార్డర్ మరోసారి విఫలమైంది. ఓపెనర్లు సంజు సాంసన్, అభిషేక్ శర్మ తక్కువ పరుగులకే ఔటయ్యారు. తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ డకౌట్ కావడం గమనార్హం. ఒకే ఓవర్ లో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ బౌలర్ మహమ్మద్ భారత్ ను తీవ్రంగా దెబ్బతీశాడు. ఆల్రౌండర్లు శివం దూబే, హార్దిక్ పాండ్యా వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరు అర్థశాతకాలతో జట్టును ఆదుకున్నారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండు తొలి 5 ఓవర్లలో 53 పరుగుల వద్ద ఒక వికెట్ కూడా కోల్పోలేదు. ఆ తర్వాత మ్యాచ్ మొత్తం మారిపోయింది. ఇండియా ఊహించని విధంగా వికెట్లు తీసి ఇంగ్లాండ్ నీ దెబ్బతీసింది.