తెలంగాణ కాంగ్రెస్ లో అలజడి నెలకొన్నట్లు పలు పధనాలు వెలువడిన విషయం తెలిసిందే. పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ సమీపంలోని ఓ హోటల్ లో వీరంతా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఓ మంత్రి తమను పట్టించుకోవడంలేదని, తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండానే ఆ మంత్రి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారని పలు రూమర్స్ వెలువడ్డాయి. కొంతమంది బిఆర్ఎస్ నేతలకు ప్రభుత్వంలో పనులు అవుతున్నాయి కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారనే విమర్శలు వినిపించాయి.
అయితే రహస్యంగా భేటీ అయిన ఎమ్మెల్యేలు పాలమూరు ఎమ్మెల్యేలు అని, వారి వారి నియోజకవర్గాలలో పనులు కాకపోవడం, బిల్లుల విషయంలో అసంతృప్తికి గురైన వీరు రహస్యంగా సమావేశం అయ్యారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇచ్చిన డిన్నర్ కి 8 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని.. ఆయనకు కావలసిన పనికి మద్దతు పలికేందుకే వెళ్లారని తెలిపారు. కానీ దీనిపై బిఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అయితే దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పుకొచ్చారు మల్లు రవి.