2025 – 26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి పలు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సంక్షేమం – సంస్కరణల సమపాళ్లలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. ఆదాయపు పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచడం పట్ల మధ్య తరగతికి ఎంతో ఊరట కలిగిస్తుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి ఇప్పటికే మూడు లక్షల కోట్లు అభివృద్ధి కోసం నిధులు కేటాయించిన ఎన్డీఏ ప్రభుత్వం, బడ్జెట్ లో అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధులు కేటాయించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని తెలిపారు.
ఇక కేంద్రం ఏపీకి కేటాయించిన వివరాల విషయానికి వెళితే.. పోలవరం ప్రాజెక్ట్ రూ. 5,936 కోట్లు. పోలవరం ప్రాజెక్టు బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157 కోట్లు. విశాఖ పోర్ట్ రూ. 730 కోట్లు. విశాఖ స్టీల్ ప్లాంట్ 3,295 కోట్లు. రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ 186 కోట్లు. లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ 375 కోట్లు. ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు. ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండవ దశకు 242.50 కోట్లు.