తెలంగాణ పై కేంద్రం అంతులేని వివక్ష చూపి.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ పై స్పందిస్తూ గాడిద గుడ్డు అనే పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నయాపైసా కేటాయించకపోవడం బీజేపీ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. పసుపు బోర్డు కు పంగనామం.. ములుగు గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ ఎగనామం.. ఈ బడ్జెట్ లో కేటాయింపులు శూన్యం అని మండిపడ్డారు.
ఇద్దరూ కేంద్ర మంత్రులు ఉన్నా.. స్వరాష్ట్రానికి నిధులు సున్నా అని.. ములుగు వర్సిటీకి 211 ఎకరాలు అప్పజెప్పినా భవనాల నిర్మాణాలను కేంద్రం నిధులు నిల్ అని.. విభజన హామీల అమలుకు గుండు సున్నా అన్నారు. ఏపీకి 15వేల కోట్లు.. తెలంగాణకు వట్టి మాటలు అని, ఏపీ వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు, తెలంగాణకు మొండిచేయి అని తెలిపారు. పోలవరం నిర్మాణానికి వేల కోట్లు.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు నయా పైసా లేదన్నారు.