ఆర్టీసీ జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించిది. ఈ నెల 10న చర్చలకు రావాలని నోటీసు ఇచ్చింది. జేఏసీ నేతలతో పాటు ఆర్టీసీ యాజమాన్యానికి సైతం లేబర్ డిపార్ట్మెంట్ ఆహ్వానం పలికింది. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే సమ్మెబాట పడుతామని ఇటీవల యాజమాన్యానికి ఆర్టీసీ కార్మికుల జేఏసీ గత నెల 27న సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన కార్మిక శాఖ కార్మికులతో పాటు ఆర్టీసీ యాజమాన్యాన్ని చర్చలకు పిలిచింది.
21 డిమాండ్లను యాజమాన్యం ముందుంచింది ఆర్టీసీ జేఏసీ.. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సమ్మె నోటీసుల్లో కోరింది. తమ డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఈ నెల 9వ తేదీన లేదా ఆ తరువాతి మొదటి డ్యూటీ నుంచి సమ్మె మొదలవుతుందని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ, కార్మికులు ఇచ్చిన అల్టిమేటం కంటే తర్వాతి రోజున చర్చలకు రావాలని కార్మిక శాఖ ఆహ్వానించడంతో ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. తామిచ్చిన గడువు దాటిన తర్వాత చర్చలకు ఆహ్వానించడంతో జేఏసీ నేతలు చర్చలకు వెళ్తారా లేక సమ్మెబాట పడతారా అనేది ఉత్కంఠగా మారింది.