సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని దేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు. ఇవాళ కేంద్ర మంత్రిని ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ డీ.కే.అరుణ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది బంజారాలు ఉన్నారని.. బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు.
ఈ అంశంలో అవసరం అయితే అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కలిశామన్నారు. ఫిబ్రవరి 15వ తేదీన సంత్ సేవాలాల్ జయంతి ఉన్నది. ఆలోపు సాధ్యం కాకపోతే ఆ తరువాతనైనా వీలైనంత త్వరగా ఆదేశాలు వచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.